పైశాచిక నేరాలకు అదే శిక్ష: హెచ్చరించిన తలసాని
- దారుణాలకు పాల్పడే వారికి స్పష్టమైన మెసేజ్
- ఇకపై విచారణలు, జైలు, బెయిల్ ఉండవు
- తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలన్నది తమ సీఎం కేసీఆర్ లక్ష్యమని తలసాని వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితులపై పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్, దేశవ్యాప్తంగా పోలీసులందరికీ దిశా నిర్దేశమైందని అన్నారు. కేవలం సంక్షేమ పథకాల్లోనే కాకుండా, ఇటువంటి శిక్షల విషయంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
కాగా, తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వేగంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించామని అన్నారు. బాధితురాలి కుటుంబానికి ఎన్ కౌంటర్ తరువాత ఎంతో కొంత ఊరట కలిగివుంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్ కౌంటర్ పై మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. సత్వర న్యాయం పేరిట, ప్రజల్లో అగ్రహం ఉందన్న కారణంతో, ఎటవంటి విచారణ జరుపకుండా నిందితులను చంపేయడం రాజ్యాంగ విరుద్ధమని మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు.