Crime News: దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి.. దీనికి ఆయనే కారకుడు!: రాహుల్ గాంధీ

  • కేరళ పర్యటనలో రాహుల్  
  • కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు
  • దేశాన్ని పాలిస్తోన్న వ్యక్తి తీరే ఇందుకు కారణం
ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలోని సుల్తాన్ బతేరీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'దేశంలోని మైనార్టీలపై హింస పెరిగిపోతోంది. వారిపై ద్వేషాన్ని పెంచుతున్నారు. అలాగే, దేశంలోని దళితులు, గిరిజనులపై కూడా హింస పెరిగిపోతోంది. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గిరిజనుల భూములను లాక్కుంటున్నారు' అని విమర్శించారు.

'దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇందుకు కారణం దేశాన్ని పాలిస్తోన్న వ్యక్తే (ప్రధాని మోదీ). ఆయన హింసను, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతోన్న విషయాన్ని ప్రతి రోజు మనం దినపత్రికల్లో చదువుతున్నాం' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Crime News
Rahul Gandhi
Congress

More Telugu News