Kolkata: కోల్ కతా టెస్టులో బంగ్లాదేశ్ ఎదురీత

  • ఇషాంత్ కు మూడు వికెట్లు
  • 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా
  • ఆదుకున్న రహీమ్, మహ్మదుల్లా జోడీ
బంగ్లాదేశ్ తో కోల్ కతాలో జరుగుతున్న డేనైట్ టెస్టులో టీమిండియా పేసర్లు మరోసారి నిప్పులు చెరిగే బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ కు పరీక్ష పెడుతున్నారు. 241 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాను ఇషాంత్ శర్మ (3/21), ఉమేశ్ యాదవ్ (1/32) బెంబేలెత్తించారు. దాంతో 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, సీనియర్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ పట్టుదలగా ఆడడంతో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ప్రస్తుతం బంగ్లా స్కోరు 4 వికెట్లకు 82 పరుగులు.

అయితే మహ్మదుల్లా (39) గాయపడడంతో అతడి స్థానంలో మెహిదీ హసన్ బ్యాటింగ్ కు దిగాడు. రహీమ్ 24 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా జట్టు ఇంకా 159 పరుగులు వెనుకబడే ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 106 పరుగులకు ఆలౌటైంది. ఇషాంత్ 5 వికెట్లతో రాణించాడు. ఆపై టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 9 వికెట్లకు 347 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
Kolkata
India
Bangladesh
Pink Ball
Cricket
Ishant Sharma

More Telugu News