Rajahmundry: హెడ్ కానిస్టేబుల్ పై యువకుల దాడి.. కత్తులతో వీరంగం

  • హెడ్ కానిస్టేబుల్ బైక్ ను ఢీకొట్టిన పోకిరీలు
  • బైక్ నంబర్ ఫొటో తీస్తుండగా ఘర్షణ
  • ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవారంలో హెడ్ కానిస్టేబుల్ పై కొందరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా నాగేశ్వరరావు పని చేస్తున్నారు. నిన్న ఆయన మోటార్ సైకిల్ పై వెళ్తుండగా... ఆనందనగర్ ఆటో స్టాండ్ వద్ద బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు ఆయన వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. ఆ తర్వాత వారి బైక్ నంబర్ ను ఆయన సెల్ ఫోన్ లో ఫొటో తీస్తుండగా వారు ఘర్షణకు దిగారు.

ఇంతటితో ఆ పోకిరాలు ఆగలేదు. నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డారు. ఆయనను కొట్టారు. కత్తులతో వీరంగం సృష్టించారు. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం తనపై దాడి జరిగినట్టు హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న త్రీటౌన్ పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. గాయపడ్డ నాగేశ్వరరావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Rajahmundry
Head Costable

More Telugu News