Chandrababu: చంద్రబాబు దీక్షకు పవన్ కల్యాణ్ మద్దతు: టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య
- ఏపీలో ఇసుక కొరతతో ఇప్పటివరకు 45 మంది ఆత్మహత్య
- కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
- గత ప్రభుత్వం ఇసుక విధానాన్నే జగన్ ప్రభుత్వం కొనసాగించాలి
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు 12 గంటల పాటు 'ఇసుక దీక్ష'ను చేపట్టనున్న నేపథ్యంలో ఈ రోజు విజయవాడలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు వెళ్లి చర్చించిన విషయం తెలిసిందే. ఆయనతో చర్చించిన అనంతరం టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వివరాలు తెలిపారు. చంద్రబాబు దీక్షకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారని అన్నారు.
ఏపీలో ఇసుక కొరత కారణంగా ఇప్పటివరకు 45 మంది ఆత్మహత్య చేసుకున్నారని వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేసిందని, ఆ విధానాన్నే జగన్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీల మద్దతును కోరామన్నారు. ఇసుక వారోత్సవాలతో ప్రయోజనం ఏమీ ఉండదని అచ్చెన్నాయుడు అన్నారు. ఇసుక సమస్య పరిష్కారం కావాలంటే గత ప్రభుత్వ విధానాన్నే మళ్లీ అమలు పర్చాలన్నారు.