Guntur District: తన బంగారు నగలు తనకు ఇవ్వమందని.. పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు!

  • అవసరాల కోసం పెద్దమ్మను డబ్బులు అడిగిన కొడుకు
  • నగలు ఇచ్చిన పెద్దమ్మ
  • తిరిగి ఇవ్వమంటే ఇంటి ముందే ట్రాక్టర్‌తో తొక్కి చంపిన వైనం
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తన వద్ద తీసుకున్న బంగారు నగలను తిరిగి ఇవ్వమని అడిగినందుకు సొంత పెద్దమ్మనే ట్రాక్టరుతో తొక్కించి చంపేశాడో కిరాతకుడు. గుంటూరు జిల్లా కొత్తపాలెంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన డేగల సుబ్బమ్మ (55) చెల్లెలి కుమారుడు పగడం రాజశేఖరరెడ్డి మోరవాగుపాలెంలో నివసిస్తున్నాడు. ఇటీవల పెద్దమ్మ వద్దకు వచ్చిన రాజశేఖరరెడ్డి తనకు డబ్బులు అవసరం ఉందని, ఉంటే ఇవ్వాలని కోరాడు. తన వద్ద డబ్బు లేదని, కావాలంటే వీటిని తీసుకెళ్లి  బ్యాంకులో తాకట్టుపెట్టి డబ్బులు తీసుకోమంటూ 16 సవర్ల బంగారు నగలు ఇచ్చింది.

ఆమె ఇచ్చిన నగలను తీసుకెళ్లి తన అవసరాలను తీర్చుకున్న రాజశేఖర్ ఇటీవల బ్యాంకు నుంచి నగలు విడిపించాడు. విషయం తెలిసిన ఆమె శనివారం తన ఇంటి ముందు నుంచి ట్రాక్టర్‌పై వెళ్తున్న రాజశేఖర్‌ను అడ్డుకుని తన నగలు ఇవ్వాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తన నగలు ఇచ్చే వరకు ట్రాక్టర్ ముందు నుంచి కదిలేది లేదని భీష్మించుకున్న సుబ్బమ్మ ట్రాక్టర్ ఎదురుగా నిల్చుంది. పెద్దమ్మ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజశేఖర్ ట్రాక్టర్‌తో ఆమెను తొక్కించి చంపేశాడు. అనంతరం ట్రాక్టర్ దిగి పారిపోతుండగా పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur District
gold ornaments
murder
tractor

More Telugu News