Ayodhya temple-mosque verdict: అయోధ్య తీర్పు ఉత్కంఠ.. యూపీ సీఎస్, డీజీపీలను తన ఛాంబర్ కు రావాలన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్!

  • ఈ నెల 15వ తేదీకి ముందే వెలువడనున్న తుది తీర్పు
  • యూపీలో లా అండ్ ఆర్డర్ పై చర్చించనున్న చీఫ్ జస్టిస్
  • కట్టుదిట్టమైన భద్రతావలయంలో ఉత్తరప్రదేశ్
అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనున్న తరుణంలో... ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారులతో సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ భేటీ కానున్నారు. సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ పై ఆయన చర్చించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మధ్యాహ్నం చీఫ్ జస్టిస్ ఛాంబర్ లో రంజన్ గొగోయ్ ను యూపీ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ కలవనున్నారు.

తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం 15వ తేదీకి ముందే అయోధ్య తుది తీర్పును సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం వెలువరించనుంది. ఈ నెల 15వ తేదీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చివరి పని దినం కావడం గమనార్హం. 17వ తేదీన ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

మరోవైపు, అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు. పలు కళాశాలలను తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. అంతేకాదు, అయోధ్య, లక్నోలలో రెండు హెలికాప్టర్లను స్టాండ్ బైగా ఉంచారు. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే వీటిని ఉపయోగిస్తారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచాలని పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. రెచ్చగొట్టే విషయాలను ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అలజడి సృష్టించేందుకు ఎవరైనా యత్నిస్తే... వారిపై ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Ayodhya temple-mosque verdict
Chief Justice of India Ranjan Gogoi
Supreme Court
Uttar Pradesh
Chief Secretary
DGP

More Telugu News