Chandrababu: రమణ దీక్షితులు ఎంట్రీపై స్పందించిన చంద్రబాబు... ఇదేం పనంటూ ఆగ్రహం!

  • టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన రమణ దీక్షితులు
  • మళ్లీ ప్రధానార్చకుడిగా నియమిస్తారేమో
  • జగన్ కు తన మతాన్ని చెప్పుకునే ధైర్యం లేదన్న బాబు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్ జగన్ సర్కారు ఏం చేయాలని అనుకుంటుందో తెలియడం లేదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు రీఎంట్రీపై స్పందించారు.

స్వామివారి పింక్ డైమండ్ విషయంలో ఎంతో గొడవ చేసి టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన దీక్షితులును తిరిగి విధుల్లోకి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. ఆయనపై టీటీడీ వేసిన పరువు నష్టం దావాను సైతం వెనక్కు తీసుకున్నారని గుర్తు చేస్తూ, ఎన్నో ఆరోపణలు వచ్చిన ఆయన్ను, ఆగమ శాస్త్ర సలహాదారుడిగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. జగన్ వైఖరిని చూస్తుంటే, త్వరలోనే ఆయన్ను ప్రధాన అర్చకుడిగా నియమించేలా ఉన్నారని నిప్పులు చెరిగారు.

వెంకన్న వద్ద జగన్ నాటకాలు ఆడుతున్నారని, ఆయన ఆటలు ఇంకెంతోకాలం సాగబోవని, సోనియా, కలామ్ వంటి అన్యమతస్థులు స్వామిపై విశ్వాసం ఉందని అఫిడవిట్ ఇచ్చి స్వామిని దర్శించుకున్నారని, తన మతం చెప్పుకుని అఫిడవిట్‌ ఇచ్చే ధైర్యం జగన్ కు లేకపోయిందని అన్నారు. ఇంట్లోని వారు చనిపోతే హిందువులు ఏడాది వరకు ఆలయాలకు వెళ్లబోరని, కానీ, జగన్‌ మాత్రం  విశ్వాసాలను తుంగలో తొక్కి పట్టువస్ర్తాలు తీసుకుని తిరుమలకు వెళ్లారని, దేవుడితో ఆటలాడుకుంటున్న జగన్ బాగుపడబోడని విమర్శలు గుప్పించారు.
Chandrababu
Jagan
TTD
Ramana Deekshitulu

More Telugu News