india: తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తున్న 'బుల్ బుల్' ప్రభావం!

  • తీవ్ర తుపానుగా మారిన బుల్ బుల్
  • పూర్తిగా మేఘావృతమైన ఆకాశం
  • శనివారం సాయంత్రం తరువాత తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో పెను తుపానుగా మారిన 'బుల్ బుల్' ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. ఈ తుపాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నప్పటికీ, ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. ఉదయం 8 గంటల సమయంలోనూ సూర్యుడు కనిపించని పరిస్థితి.

ప్రస్తుతం బుల్ బుల్ అండమాన్ కు సమీపంలోనే ఉందని, దీని ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంత రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీని ప్రభావం మరో 72 గంటల వరకూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బెంగాల్ తీరంలో గంటకు 100 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో బుల్ బుల్ ప్రభావం అధికంగా ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. శనివారం సాయంత్రం తరువాత పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. తుపాను తన దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇది ఒడిశా వైపు పయనిస్తే, చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని హెచ్చరించింది.
india
Bulbul
Cyclone
Andhra Pradesh
Telangana
West Bengal
Bangladesh

More Telugu News