Ashwathama Reddy: గవర్నర్ తో ఆర్టీసీ జేఏసీ భేటీ.. చర్చలకు వెళ్లడానికి సిద్ధమన్న అశ్వత్థామరెడ్డి

  • కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుదే
  • కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదే
  • కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు
కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుదేనని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జేఏసీ నేతలు హైదరాబాద్ లో గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ ను కలిసి తమ సమ్మె గురించి వివరించి చెప్పారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న వైఖరిని గవర్నర్ కు వివరించామని చెప్పారు.

సమ్మె విరమించి ఆర్టీసీ యూనియన్ నేతలు చర్చలకు సిద్ధం కావాలంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు చేసిన వ్యాఖ్యలపై అశ్వత్థామరెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనని, చర్చలకు వెళ్లడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. ముందుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తమ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే జేఏసీ పని చేస్తోందని, వాటిని సాధిస్తామని అన్నారు.

Ashwathama Reddy
TSRTC
Telangana

More Telugu News