tsrtc: టీఎస్సార్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలి: కేసీఆర్ కు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

  • ఉద్యోగుల ఆందోళనలను సానుభూతితో అర్థం చేసుకోవాలి
  • కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు
  • ఉద్యోగులపై ఉదారత చూపాలని సీఎం కేసీఆర్ కు వినతి
టీఎస్సార్టీసీ సమ్మెపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని తమ పార్టీ అభిప్రాయపడుతోందని అన్నారు. టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన సమ్మె సందర్భంగా 48,660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు.

నాడు సకలజనుల సమ్మెలో భాగంగా తెలంగాణ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి  అండగా ఉన్నారని గుర్తుచేశారు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగసంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామని, ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా వుందని అన్నారు. ఉద్యోగులపై ఉదారత చూపి, టీఎస్సార్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
tsrtc
cm
kcr
janasena
Pawan Kalyan

More Telugu News