మోదీ తీరు చూస్తుంటే మమ్మల్ని ప్రజలు చితక్కొట్టడం ఖాయమనిపిస్తోంది: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే
- బీహార్ వరదలపై ఆరా తీసిన మోదీ
- కర్ణాటక వరదల సమయంలో పట్టించుకోని ప్రధాని
- ప్రజల తర్వాతే పార్టీ అని తెగేసి చెప్పిన బసనగౌడ
ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ప్రజల మనోభావాలు, భావోద్వేగాలకు సంబంధించినదని బసనగౌడ పేర్కొన్నారు. బీహార్ వరదలపై ట్వీట్ చేసిన మోదీ కర్ణాటక గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లడం కష్టమన్నారు. ప్రజలకు తమ ముఖాలు ఎలా చూపించాలని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికలు లేవనే రాష్ట్రం గురించి మోదీ పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఏది ఏమైనా ముందు ప్రజలు, ఆ తర్వాత రాష్ట్రం, అటు తర్వాతే పార్టీ అని తెగేసి చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి గురించి పార్టీ ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, లేదంటే తాము ఎమ్మెల్యేలమని, ఎంపీలమని చెబితే ప్రజలు చితక్కొట్టడం ఖాయమని బసనగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టులో కర్ణాటకను వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో మోదీ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. కానీ బీహార్ వరదలపై ట్వీట్ చేసిన మోదీ, ఆ రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, బీహార్ వరదల్లో ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు.