Vijay Sai Reddy: జయాబచ్చన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన బీజేపీ నేత

  • విజయసాయిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి
  • గతంలో జోడు పదవుల్లో కొనసాగిన జయాబచ్చన్
  • జయా రాజ్యసభ సభ్వత్వాన్ని రద్దు చేసిన నాటి రాష్ట్రపతి కలాం
బీజేపీ నేత రామకోటయ్య వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి నియామకంపై రామకోటయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది లాభదాయక పదవేనని, దీనిపై ఏపీ సర్కారు జారీ చేసిన జీవోను ప్రస్తావించారు. విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో జయాబచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో సినీ నటి జయాబచ్చన్ కూడా జోడు పదవుల్లో కొనసాగడంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న జయాబచ్చన్ ఉత్తరప్రదేశ్ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గానూ వ్యవహరించారు. దాంతో ఈసీ సూచన మేరకు ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం రద్దు చేశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జయా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆమె నిర్వహిస్తున్నది లాభదాయకమైన పదవేనని సుప్రీం తేల్చింది. ఇప్పుడు విజయసాయి విషయంలోనూ ఆ తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకోవాలని రామకోటయ్య కోరుతున్నారు.
Vijay Sai Reddy
Ramakotaiah
BJP
YSRCP
President Of India

More Telugu News