గవర్నర్ తమిళి సై గురించి తప్పుడు రాతలు రాయించిన కేసీఆర్: బీజేపీ నేత మండిపాటు

  • ప్రమాణ స్వీకారం చేసి రోజైనా గడవకముందే తప్పుడు రాతలు
  • గవర్నర్ పై విషం కక్కేలా వార్తలా?
  • నిప్పులు చెరిగిన ఇంద్రసేనారెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవకముందే తమిళి సై సౌందరరాజన్‌ పై, ముఖ్యమంత్రి కేసీఆర్, తన కనుసన్నలలో కించపరిచే వ్యాసాలు రాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి నిప్పులు చెరిగారు. స్వయంగా సీఎం సీపీఆర్‌ఓ, గవర్నర్ పై విషం కక్కేలా వార్తలు రాయించారని ఆయన ఆరోపించారు. వెంటనే సీపీఆర్ఓను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని, లేకుంటే క్రిమినల్‌ కేసు పెడతామని అన్నారు.

ప్రభుత్వ వేతనం తీసుకుంటూ, రాజ్యాంగ బద్ధమైన పదవిని అవమానించేలా ఆయన ప్రవర్తించారని అన్నారు. గవర్నర్‌ ను కించపరిచేలా వ్యాసం రాసి, దాని చివరన 'ఇది నా సొంత అభిప్రాయం' అని రాయించారని అన్న ఇంద్రసేనా రెడ్డి, గవర్నర్‌ పదవిని వారు అవమానించారని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ పై నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ లో అసమ్మతి బయటకు వస్తోందని, మొన్న ఈటల, నిన్న రసమయి, నాయిని, జోగురామన్నలు తమ బాధను బయట పెట్టారని అన్నారు.
Go Back to Shorts
Indrasena Reddy
Tamil Isai
Governor
KCR
CPRO

More Telugu News