ఒక మంచి మిత్రుడిని కోల్పోయా: మోదీ
- జైట్లీ అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత
- మధుర స్మృతులను మిగిల్చి వెళ్లిపోయారు
- దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
బీజేపీ-అరుణ్ జైట్లీలది విడదీయలేని అనుబంధమని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు. బీజేపీలో అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత అని కితాబిచ్చారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో శాఖలకు మంత్రిగా పని చేశారని... దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేశారని చెప్పారు. విదేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడం, రక్షణరంగాన్ని బలోపేతం చేయడం, ప్రజానుకూలమైన చట్టాలను తయారు చేయడంలో జైట్లీ సేవలందించారని తెలిపారు.
ఎంతో హాస్య చతురత, ఛరిష్మా కలిగిన వ్యక్తి జైట్లీ అని మోదీ అన్నారు. భారత రాజ్యాంగం, చరిత్ర, పబ్లిక్ పాలసీ, పాలనలో అమోఘమైన జ్ఞానం ఆయన సొంతమని చెప్పారు. భారత్ కు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జైట్లీ మన మధ్య లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోహన్ తో మాట్లాడానని... సానుభూతిని తెలియజేశానని అన్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.