దేవెగౌడ, కుమారస్వామిలపై మండిపడ్డ సిద్ధరామయ్య
- సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దేవెగౌడ, ఆయన కుమారులే కారణం
- నా గురించి దేవెగౌడ అసత్యాలు మాట్లాడారు
- సీఎం పదవికి కుమారస్వామి పేరును నేనే ప్రతిపాదించా
సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దేవెగౌడ, ఆయన కుమారులు కుమారస్వామి, రేవణ్ణలే కారణమని సిద్ధరామయ్య ఆరోపించారు. కానీ, ప్రభుత్వం కూలిపోవడానికి కారణం తానేనని ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవెగౌడ అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి పేరును తానే ప్రతిపాదించానని చెప్పారు. జేడీఎస్ తో పొత్తుపై తమ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని... పార్టీ హైకమాండ్ కు కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతానని అన్నారు.
'మన దేశంలో ఒక మతతత్వ పార్టీ అధికారంలో ఉంది. విపక్షాలను కేంద్ర ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజంలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకూడదని భావించాను. కుమారస్వామి సీఎం కావడానికి నేడు అడ్డుపడలేదు' అని సిద్ధరామయ్య చెప్పారు.