Andhra Pradesh: ‘స్లెడ్జింగ్’ ఆరోగ్యకరంగా ఉన్నంత సేపూ ఎలాంటి ఇబ్బంది ఉండదు: ఆసీస్ మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్

  • అమరావతిలోని అంతర్జాతీయ క్రీడా మైదానం సందర్శన
  • వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం మంచిది కాదు
  • ఆంధ్రా క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్న మెక్ గ్రాత్
క్రికెట్ లో స్లెడ్జింగ్ ఆరోగ్యకరంగా ఉన్నంత సేపూ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆసీస్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ అన్నాడు. స్లెడ్జింగ్ ద్వారా వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతిలోని అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని మెక్ గ్రాత్ సందర్శించాడు. ఆయన వెంట బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నారు.

ఆంధ్రా క్రికెట్ క్రీడాకారులకు ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ ద్వారా ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ అంశాల్లో క్రీడాకారులను రెండ్రోజుల పాటు ఆయన పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మెక్ గ్రాత్ మాట్లాడుతూ, ఒక బౌలర్ తాను అనుకున్న విధంగా బౌలింగ్ చేస్తున్నామనే నమ్మకం కలిగే వరకూ ప్రాక్టీసు చెయ్యడమే ఉత్తమమైన మార్గం అని అన్నారు.

దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ అమరావతికి రావడం సంతోషం: ఎమ్మెస్కే ప్రసాద్

ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లలో మెక్ గ్రాత్ మొదటి వరుసలో ఉంటారని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసించారు. అలాంటి దిగ్గజ బౌలర్ అమరావతికి రావడం, మన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం సంతోషకరమైన విషయమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రప్రథమంగా రెసిడెన్షియల్ అకాడమీలు స్థాపించిందని, ఈ అకాడమీలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని అన్నారు.
Andhra Pradesh
Amaravathi
Australia
MC Grath

More Telugu News