Amaravathi: ప్రాజెక్టులు నిలిపివేస్తే ప్రజలు నష్టపోతారు: పవన్ కల్యాణ్

  • రాజధాని పనులకు బ్రేక్ తో 20 వేల మంది రోడ్డున పడ్డారు
  • చిల్లర రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి  
  • భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసే క్రమంలో ప్రజలు నష్టపోరాదని, గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప ప్రాజెక్టులను మొత్తానికే నిలిపివేయడం సరికాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భీమవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం నిలిపివేయడం వల్ల దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని అన్నారు. వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును నిలిపివేయడంలో ఏదో లోతైన విషయం ఉందన్న పవన్ కల్యాణ్, చిల్లర రాజకీయాల మూలంగా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని, అవగాహన ఉన్న నాయకులు చేయాల్సిన పని కాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదని, ముందు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టినట్లు వివరించారు. 
Amaravathi
Janasena
Pawan Kalyan

More Telugu News