Jagan: హోదా గురించి మాట్లాడరేం?: జగన్ పై మండిపడ్డ బృందాకారత్

  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై హంగామా చేశారు
  • అధికారంలోకి వచ్చాక దానిపై నోరు కూడా మెదపడం లేదు
  • రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై నానా హంగామా చేసిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక నోరు మెదపడం లేదని ఆమె మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీల తీరు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని అన్నారు.

హోదాపై పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. బీజేపీతో జగన్ పెట్టుకున్న అప్రజాస్వామిక, అనైతిక పొత్తు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని అన్నారు. గిరిజనుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని... ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తే గిరిజనులకు ఎవరు రక్షణగా ఉంటారని ప్రశ్నించారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై సీపీఎం పోరాటాలకు సిద్ధమవుతోందని చెప్పారు. బేటీ బచావో అని నినాదాలు ఇచ్చినవారు... బాలికలకు రక్షణ మాత్రం ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.
Jagan
Brinda Karat
Specail Status
YSRCP
CPM

More Telugu News