Odisha: ఇసుకలో కూరుకుపోయి.. 8 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన కార్మికుడు!

  • కార్మికుడిపై కూలిన ఇసుక దిబ్బ
  • గాలించి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
  • ఒడిశాలో గత నెల 19న ఘటన
ఒడిశాలో ఇసుకలో కూరుకుపోయిన ఓ కార్మికుడు 8 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడని అనిపించుకున్నాడు. గత నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అనుగుల్ జిల్లా చండిపదలో స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన షేక్ బరాజా ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత నెల 19న ఉదయం ఏటి కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. అయితే అదే సమయంలో తనపై ఓ పెద్ద గట్టు కూలిపోవడంతో అందులో కూరుకుపోయాడు. అదృష్టవశాత్తు తలమాత్రం బయటకు ఉండడంతో ప్రాణాలతో ఉండగలిగాడు.

బహిర్భూమికి వెళ్లిన షేక్ బరాజా ఎంతకీ తిరిగిరాకపోవడంతో మిగతా కార్మికులు, కాంట్రాక్టర్ చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, బాధిత కార్మికుడు వెళ్లిన ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో అతడి ఆర్తనాదాలు వినే దిక్కు లేకుండా పోయింది. అయితే, అదృష్టవశాత్తు గత నెల 26న కొందరు గ్రామస్థులు ఆ ప్రాంతానికి వెళ్లడంతో వారిని చూసి షేక్ కేకలు వేశాడు. ఇసుకలో కూరుకుపోయి ఉన్న అతడిని చూసి నిర్ఘాంతపోయిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకుని బాధితుడిని వెలికి తీశారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు.  
Odisha
swachh bharat abhiyan
sand
worker

More Telugu News