Jammu And Kashmir: 'ఆర్టికల్35ఏ'ను ఏ చేయి తాకినా.. శరీరం మొత్తం కాలి బూడిదవుతుంది: మెహబూబా ముఫ్తీ

  • ఆర్టికల్ 35ఏను రద్దు చేయాలనుకోవడం అగ్నికి ఆజ్యం పోయడమే
  • జమ్ముకశ్మీర్ కు భారీగా బలగాలను తరలించాల్సి అవసరం ఏమొచ్చింది?
  • పాకిస్థాన్ తో చర్చలు జరపనంత వరకు కశ్మీర్ సమస్య పరిష్కారం కాదు
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 35ఏను రద్దు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని... దీనికి వ్యతిరేకంగా అందరం కలసి పోరాడుదామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. 'ఆర్టికల్ 35ఏను రద్దు చేయబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సి ఉంది. రాజకీయ నాయకులే కాకుండా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, కశ్మీర్ లోని ప్రజలంతా ఏకమై కేంద్రంపై పోరాటం చేద్దాం' అంటూ పిలుపునిచ్చారు.

ఆర్టికల్ 35ఏను రద్దు చేయాలనుకోవడం అగ్నికి ఆజ్యం పోయడమేనని ముఫ్తీ అన్నారు. ఈ ఆర్టికల్ ను ఏ చేయి అయినా తాకాలనుకుంటే... ఆ చేయి మాత్రమే కాదు, మొత్తం శరీరం కాలి బూడిదవుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో, జమ్ముకశ్మీర్ లో 10 వేల మంది సాయుధ పారామిలిటరీ బలగాలను మోహరింపజేయడంపై ఆమె మండిపడ్డారు. రాష్ట్రానికి అదనపు బలగాలను తరలించడం ద్వారా రాష్ట్ర ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం భయాందోళనలను రేకెత్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో రాష్ట్రానికి బలగాలను పంపించేంత అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.

జమ్ముకశ్మీర్ ది రాజకీయపరమైన సమస్య అని... మిలిటరీ ద్వారా సమస్యను పరిష్కరించలేరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన కార్యాచరణను పున:సమీక్షించుకోవాలని సూచించారు. కశ్మీర్ ప్రజలతో పాటు పాకిస్థాన్ తో చర్చలు జరపనంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని అన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
Jammu And Kashmir
Mehabooba Mufti
Article 35A

More Telugu News