Karnataka: ఆ ధైర్యంతోనే ఎమ్మెల్యేలపై వేటు వేశా: కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్

  • రెబెల్ ఎమ్మెల్యేల తీరు చట్ట వ్యతిరేకంగా ఉందనే విషయం అర్థమైంది
  • తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే
  • యువతరానికి ఆదర్శంగా నిలవాలని భావించాను
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన కర్ణాటక రాజకీయాలకు తెరపడిన సంగతి తెలిసిందే. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం... శాసనసభలో యడియూరప్ప (బీజేపీ) బలాన్ని నిరూపించుకోవడం విదితమే. అయితే, ఈ ఎపిసోడ్ మొత్తంలో కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ పతాక శీర్షికల్లో నిలిచారు. రెబెల్ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపిన ఆయన... ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి సంచలనం రేపారు. బీజేపీ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన తరుణంలో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు కూడా వేశారు.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం హైదరాబాదుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చట్ట వ్యతిరేకంగా ఉందనే విషయం తనకు అర్థమైందని... ఆ ధైర్యంతోనే వారిపై వేటు వేశానని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. తాను చేసింది గొప్ప పనేం కాదని... కాకపోతే, యువతరానికి మార్గదర్శకంగా నిలవాలని భావించానని చెప్పారు. ఇతర రాష్ట్రాల స్పీకర్లు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోరో తనకు అర్థం కాదని అన్నారు. మరోవైపు, కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ బలపరీక్ష ముగిసిన వెంటనే, సభలోనే తన స్పీకర్ పదవికి ఆయన రాజీనామా చేశారు.
Karnataka
Speaker
Ramesh Kumar
Ex Speaker

More Telugu News