Pakistan: 72 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో తెరుచుకోనున్న వెయ్యేళ్ల పురాతన హిందూ ఆలయం

  • సియాల్ కోట్ లోని షావాలా తేజాసింగ్ ఆలయానికి మహర్దశ
  • ఆలయాన్ని తెరవాలని నిర్ణయించిన ఇమ్రాన్ ఖాన్
  • ఆలయాన్ని స్వేచ్ఛగా దర్శించుకోవచ్చన్న డిప్యూటీ కమిషనర్

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ దేవాలయానికి మళ్లీ మహర్దశ రాబోతోంది. పాకిస్థాన్ లోని సియాల్ కోట్ లో ఈ పురాతన ఆలయం ఉంది. 'షావాలా తేజాసింగ్' ఆలయాన్ని సర్దార్ తేజా సింగ్ నిర్మించారు. భారత్, పాక్ విభజన సమయంలో 72 ఏళ్ల క్రితం ఈ ఆలయం మూతపడింది. భారత్ లో బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం... 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం ఆపేశారు.

ఈ ఆలయాన్ని మళ్లీ తెరవాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు పాక్ మీడియా వెల్లడించింది. ఆలయంలో దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాన్ని పరిరక్షించే పనులను కూడా ప్రారంభించబోతోంది. ఈ సందర్భంగా సియాల్ కోట్ డిప్యూటీ కమిషనర్ బిలాల్ హైదర్ మాట్లాడుతూ, ఆలయాన్ని ప్రజలు స్వేచ్ఛగా దర్శించుకోవచ్చని తెలిపారు.

More Telugu News