BJP: బీజేపీది ధన రాజకీయం : సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కారత్‌

  • కర్ణాటకలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటీశ్వరులయ్యారు
  • ఏపీలో రాజ్యసభ సభ్యులను అలాగే కొన్నారు
  • బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సైద్ధాంతిక పోరాటం చేయాలి
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను అడ్డదారిలో బలపడాలని చూస్తున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డబ్బుతో రాజకీయాలు చేస్తోందని  సీపీఎం పాలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కారత్‌ మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసేందుకు నోట్లు వెదజల్లుతోందని ద్వజమెత్తారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ రాజేసిన అగ్గి కారణంగా అక్కడి అసమ్మతి ఎమ్మెల్యేలు కోటీశ్వరులయ్యారని ఆరోపించారు. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు ఏపీకి చెందిన నలుగురు టీడీపీ ఎంపీలను కొనుగోలు చేసిందన్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చిన భారీ నిధులతో దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఇవేనన్నారు.

మరోవైపు  హిందూమతానికి ప్రమాదం పొంచి ఉందని భయపెడుతూ హిందువులను కూడగట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను కేవలం ఎన్నికల ద్వారా ఎదుర్కోవడం అసాధ్యమన్నారు. సైద్ధాంతిక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక, తమది లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం గత ఎన్నికల్లో గుడులు, గోపురాలు తిరిగారని ఎద్దేవా చేశారు.
BJP
CPM
Vijayawada
prakashkarat

More Telugu News