నాపై జగన్ కక్ష సాధింపు: మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప

సీఎం వైఎస్ జగన్‌ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయకుండా, తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు, విచారణలతోనే కాలం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు.

కాకినాడ కలెక్టరేట్‌ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టిన జగన్ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొందని అన్నారు. జగన్ ఇచ్చిన నవరత్నాల హామీల్లో రెండు ఇప్పటికే రాలిపోయాయని సెటైర్లు వేశారు. అసెంబ్లీలో తాము మాట్లాడితే ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో మైకులు కట్ చేస్తున్నారని, అందువల్ల బయటకు వచ్చి ప్రజల వాణిని, వ్యతిరేకతను వినిపిస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతుల రుణమాఫీని పూర్తి చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన, ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకోవాలని అన్నారు.


More Telugu News