Police: చంద్రబాబు, లోకేశ్ పేరిట మోసం చేసిన మాజీ మంత్రి మనవడు.. అరెస్ట్!

గతంలో చంద్రబాబునాయడు, లోకేశ్ లతో దిగిన ఫోటోలను చూపిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను అడ్డంగా ముంచేశాడో టీడీపీ నేత. ఇతను మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు రెడ్డి గౌతమ్ అని తెలియడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

ఇతని చేతిలో మోసపోయిన ఓ యువతి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ లో ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గౌతమ్ తో పాటు, నంద్యాల ప్రాంతానికి చెందిన శివనాగార్జునరెడ్డి,  సతీష్, మిథున్‌ చక్రవర్తి ఓ టీమ్ గా ఏర్పడ్డారు. వీరంతా నిరుద్యోగులకు ఎరవేసి, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు.

ఇలా ఏడుగురి నుంచి రూ. 14 లక్షలు వసూలు చేశారు. నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ లను సృష్టించి బాధితులకు ఇచ్చారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు నలుగురినీ అరెస్ట్ చేశామని, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని తుళ్లూరు ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ తెలిపారు. కేసులో సంబంధమున్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అన్నారు.
Police
Amaravati
Tulluru
Arrest
Ex Minister
Grandson

More Telugu News