Andhra Pradesh: చంద్రబాబు పాలనంతా దావోస్, సింగపూర్ పర్యటనలతోనే ముగిసింది: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
- చంద్రబాబు పెట్టుబడిదారుల గురించే ఆలోచించారు
- రైతులు, బలహీనవర్గాల గురించి ఆలోచించ లేదు
- ప్రస్తుత బడ్జెట్ సీఎం జగన్ ఆలోచనలను ప్రతిబింబిస్తోంది
చంద్రబాబు పాలనంతా దావోస్, సింగపూర్ పర్యటనలతోనే ముగిసిందని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. ఏపీ శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో పెట్టుబడిదారుల గురించి మాత్రమే ఆలోచించారు తప్ప, రైతులు, బలహీనవర్గాల గురించి కనీస ఆలోచన చేయలేదని విమర్శించారు. గత ఐదేళ్లలో పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారని, ప్రస్తుత బడ్జెట్ సీఎం జగన్ ఆలోచలను ప్రతిబింబిస్తోందని అన్నారు. బలహీనవర్గాల గురించి జగన్ లా ఆలోచించిన వ్యక్తి మరొకరు ఉండరని, దివంగత సీఎం వైఎస్ ఆర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని, కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చారని అన్నారు. టీడీపీకి ఎన్నికలు వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు.