Andhra Pradesh: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించిన రాపాక.. వైసీపీ బడ్జెట్ పై ప్రశంసల వర్షం!

  • ఏపీ బడ్జెట్ ను పారదర్శకంగా రూపొందించారు
  • అధికార పక్షాన్ని వ్యతిరేకించమని పవన్ చెప్పలేదు
  • మంచి పనులకు మేం మద్దతు ఇస్తాం
వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టోను దైవ గ్రంథంతో పోల్చిందనీ, ఇందులో నిజంగా అన్నీ ప్రజా సంక్షేమ పథకాలే ఉన్నాయని జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. ఏపీ ఆర్థిక బడ్జెట్ 2019-20ను చాలా పారదర్శకంగా రూపొందించారని వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో రాపాక మాట్లాడుతూ..‘అధ్యక్షా.. నేను జనసేన తరఫున మాట్లాడుతున్నా అధ్యక్షా. అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కల్యాణ్ చెప్పలేదు అధ్యక్షా.

ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతుంటే సపోర్ట్ చేయమని చెప్పారే తప్ప, వాళ్లు అధికార పక్షం కాబట్టి వాళ్లు ఏం చేసినా వ్యతిరేకించమని చెప్పలేదు అధ్యక్షా. ప్రభుత్వం ప్రజల కోసం చేసే మంచి పనులను సమర్థిస్తాం. ఏపీ ప్రభుత్వం అటు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చూసుకుంటూ అన్నివర్గాలకు సమదృష్టితో చూస్తూ ఈ బడ్జెట్ ను రూపొందించింది.

అలాగే సుమారు రూ.28,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారుచేశారు అధ్యక్షా. తండ్రి వైఎస్  తరహాలో ఆయన కుమారుడు, సీఎం జగన్ రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చింది’ అని ప్రశంసలు కురిపించారు.
Andhra Pradesh
YSRCP
Jana Sena
budget
rapaka
varaprasad

More Telugu News