Chandrababu: టీడీపీలో సంక్షోభంపై ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు!

  • ప్రస్తుతం యూరప్ పర్యటనలో చంద్రబాబు
  • టీడీపీకి సంక్షోభాలు కొత్తేమీ కాదు
  • ప్రజలు, కార్యకర్తలే తన బలమన్న చంద్రబాబు
బీజేపీ అవకాశవాద రాజకీయాల్లో పావులుగా మారి ఎంతమంది నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు, ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, సంక్షోభాలు టీడీపీకి కొత్తేమీ కాదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటారని, వారి బలమే తనకు ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే నాడు బీజేపీకి దూరమయ్యామని చంద్రబాబు స్పష్టం చేశారు. నాడు బీజేపీని వీడకుండా కలిసుంటే టీడీపీ పరిస్థితి నేడు చాలా మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డారు. అలా కలిసుంటే, పార్టీ బాగున్నా, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టాల్సి వచ్చేదని, కానీ తాను ఆ పని చేయలేదని అన్నారు. తన జీవితం మొత్తం ప్రజల ప్రయోజనాల కోసమే కష్టపడ్డానని తెలిపారు. అధికారంలో ఉన్నామా? లేదా? అన్న సంగతిని ఎన్నడూ పట్టించుకోలేదని స్పష్టం చేశారు.

పార్టీని వీడి వెళ్లిన వారికి వారి వ్యక్తిగత అజెండాలు ఉన్నాయని, ఇలాంటి సంక్షోభాలు తనకేమీ కొత్త కాదని, గతంలోనూ తెలుగుదేశం చచ్చిపోయిందని, పూడ్చి పెట్టామని కొందరు ప్రగల్భాలు పలికారని, ఆ స్థితి నుంచి కూడా లేచి బయటకు వచ్చి అధికారాన్ని పొందామని గుర్తు చేశారు. తాను ఎన్నడూ చేతులు ఎత్తివేయలేదని, పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజల బలం ఉందని, ఇందులో ఏ మాత్రమూ సందేహం లేదని అన్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News