Chandrababu: చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలతో రగిలిపోయిన టీడీపీ సభ్యులు... అదేస్థాయిలో స్పీకర్ ఉగ్రరూపం!
- ఏపీ అసెంబ్లీలో రగులుతున్న ప్రత్యేక హోదా అంశం
- చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్
- టీడీపీ సభ్యుల అభ్యంతరం
ఏపీ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకహోదా అంశంపై అధికార, విపక్ష నేతల మధ్య ఘాటైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, ఆయన నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, సత్యదూరమైన మాటలే అంటూ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. "ఆల్రెడీ ప్రత్యేకహోదా ఇచ్చిన తర్వాత, దాన్ని అమలు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైతే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకహోదా ఇవ్వమని మళ్లీ అడగడం ఎందుకో అర్థం కావడంలేదు అధ్యక్షా" అంటూ జగన్ వ్యంగ్యంగా మాట్లాడారు.
దాంతో టీడీపీ ఎమ్మెల్యేలకు చిర్రెత్తుకొచ్చింది. ఘాటైన పదజాలంతో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. జగన్ కు దీటుగా బదులిచ్చేందుకు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా సభ్యులు ఒక్కసారిగా ఆవేశం ప్రదర్శించారు. స్పీకర్ పట్టించుకోకపోవడంతో ఈసారి సీఎం జగన్నే అడిగారు. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్ కు చెప్పండంటూ కోరారు.
దాంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. "అచ్చెన్నాయుడు గారూ మీరు ఉపయోగించిన ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, మీ ఉద్దేశం ఏంటి? సీఎం గారు మొదటి రోజే చెప్పారు, నాకు సభపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చాన్స్ కావాలంటే నన్నడగాలి, 'సీఎంగారూ మీరు చెప్పండి స్పీకర్ గారికి' అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదు, నేను అంగీకరించను. ఇక మీ వాదనలు ఆపి కూర్చోండి. అవకాశం ఇస్తాను కానీ ఇది పద్ధతి కాదు" అంటూ మండిపడ్డారు.