Nana Patekar: లైంగిక వేధింపుల కేసులో నానా పటేకర్ కు ఊరట!

  • క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు
  • నానా తప్పుచేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న పోలీసులు
  • సాక్షులు భయపడి ముందుకు రాలేదన్న తనుశ్రీ న్యాయవాది
తెలుగులో కూడా నటించిన తనుశ్రీ దత్తా అనే హీరోయిన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడా వ్యవహారంలో నానా పటేకర్ కు ఊరట లభించింది. ఆయన తప్పు చేశారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదించారు. దాంతో నానా పటేకర్ ను న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది. కొంతకాలం క్రితం దేశంలో మీటూ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో తనుశ్రీ దత్తా సంచలనాత్మక రీతిలో నానా పటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

పదేళ్ల కిందట 'హార్న్ ఓకే ప్లీజ్' చిత్రంలో నటిస్తున్న సమయంలో నానా తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు నానా పటేకర్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించలేకపోయారు. అయితే, తనుశ్రీ న్యాయవాది సుజయ్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ, నానా పటేకర్ కు భయపడి కొందరు సాక్షులు ముందుకు రావడంలేదని, తనుశ్రీ దీనిపై ప్రొటెస్ట్ రిపోర్ట్ దాఖలు చేస్తారని పేర్కొన్నారు. 
Nana Patekar
Tanushree Dutta

More Telugu News