BJP: రాజ్యసభకు బీజేపీ సీనియర్లు... అధిష్ఠానం యోచన!

  • అద్వానీ, జోషి, సుష్మా స్వరాజ్‌కు అవకాశం
  • సార్వత్రిక ఎన్నికల్లో వీరిని పోటీకి నిలపని పార్టీ
  • విమర్శలు చెలరేగడంతో దిద్దుబాటు చర్యన్న అభిప్రాయం

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దిగ్గజ నాయకులు ఎల్‌.కె.అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారిని పక్కన పెట్టి విమర్శలు ఎదుర్కొన్న పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పక్కన పెట్టిన అద్వానీ, జోషీతోపాటు సుష్మా స్వరాజ్‌లను రాజ్యసభకు పంపే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం.

 ఈ వారంలోనే సమావేశం నిర్వహించి, దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వయోపరిమితి విధించాలని నిర్ణయించిన బీజేపీ అధిష్ఠానం అన్నట్టే ఈసారి 75 ఏళ్లు దాటిన అద్వానీ, జోషీలకు టికెట్టు కేటాయించలేదు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గత ఏడాదే సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు. దీంతో ఈ ముగ్గురు నేతలు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

అయితే ఎంతో అనుభవం, పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన పెద్దల్ని కావాలనే పక్కన పెట్టారంటూ ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షాలపై విమర్శల వర్షం కురిసింది.  ముఖ్యంగా అద్వానీ స్థానాన్ని అమిత్‌షాకు కేటాయించడం మరిన్ని ఆరోపణలకు కారణమయింది. ఈ పరిస్థితుల్లో తాజా నిర్ణయం ఈ విమర్శలన్నింటికీ సమాధానం అవుతుందని బీజేపీ అధిష్ఠానం యోచనగా తెలుస్తోంది.

More Telugu News