TikTok: నేపాల్ టిక్‌టాక్ స్టార్‌ను కలిసేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ముంబై బాలిక.. తల్లిదండ్రులకు భావోద్వేగంతో కూడిన లేఖ!

  • 16 ఏళ్ల టిక్ టాక్ స్టార్‌ని కలిసేందుకు ఇంటిని వీడిన బాలిక
  • 8 గంటల్లోనే పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
  • తండ్రిపై కోపంతోనేనన్న పోలీసులు

టిక్ టాక్.. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇప్పుడందరూ దీనికి బానిసలే. యూత్‌లో యమా క్రేజ్ సంపాదించుకున్న ఈ వీడియో షేరింగ్ యాప్ ఇటీవల వివాదాల్లో చిక్కుకుని నిషేధానికి కూడా గురైంది. తాజాగా, ఈ యాప్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పే మరో ఘటన ముంబైలో జరిగింది. నేపాల్‌కు చెందిన తన అభిమాన టిక్‌టాక్ స్టార్‌ని కలిసేందుకు 14 ఏళ్ల ముంబై బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెళ్తూవెళ్తూ తల్లిదండ్రులకు భావోద్వేగంతో కూడిన ఓ లేఖ కూడా రాసింది. తాను ప్రేమికుడితో కలిసి వెళ్లిపోవడం లేదని, తన గురించి భయపడాల్సిన అవసరం లేదని, తనకాళ్లపై తాను నిలబడతానని లేఖలో పేర్కొంది.

లేఖ చూసి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 గంటల్లోనే బాలికను గుర్తించి అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నేపాల్‌లో నివసించే 16 ఏళ్ల టిక్ టాక్ స్టార్ రియాజ్ అఫ్రీన్‌ను కలుసుకునేందుకే ఆమె ఇంటిని వీడినట్టు పోలీసులు తెలిపారు.

బాలిక తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో.. ‘‘అమ్మా నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. నాన్న పద్ధతి నాకు నచ్చలేదు. నా గురించి ఎక్కువగా ఆలోచించకు. నేను వెళ్లిపోయానని నువ్వు అఘాయిత్యం చేసుకోనని దేవుడి మీద ప్రమాణం చెయ్యి. ప్రేమించిన అబ్బాయితో నేను వెళ్లిపోతున్నానని నీవు అనుకుంటే అది తప్పే. అటువంటిదేమీ లేదు. నేను అబ్బాయితో పారిపోవడం లేదు.." అని లేఖలో పేర్కొంది. అబ్బాయిలతో మాట్లాడితే తండ్రి కోప్పడుతుండడంతోనే బాలిక ఈ పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. నేపాల్ కు  చెందిన టిక్ టాక్ స్టార్ అంటే ఈ అమ్మాయికి బాగా ఇష్టమన్న విషయం తెలిసి, పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించి, నేపాల్ వెళ్లబోతున్న ఆమెను పట్టుకుని తల్లిదండ్రులకు  అప్పగించారు.

More Telugu News