Chandrababu: కుప్పంలో తన ఆధిక్యం పడిపోవడంపై స్థానిక నేతలను ఆరా తీసిన చంద్రబాబు

  • కుప్పం నేతలతో సమావేశమైన టీడీపీ అధినేత
  • గత ఎన్నికల్లో చంద్రబాబుకు 70 వేల ఆధిక్యం
  • ఈసారి భారీగా తగ్గిన ఓట్లు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కుప్పం టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల్లో కుప్పం నియోజకవర్గం పరిస్థితిపై సమీక్ష జరిపారు. ప్రధానంగా ఈసారి తన మెజారిటీ తగ్గడంపై చంద్రబాబు స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. 2014 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానంలో 70 వేల ఓట్ల మెజారిటీ రాగా, ఈసారి అది 30 వేలకు తగ్గిపోవడంపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరీ ఈ స్థాయిలో ఆధిక్యం తగ్గడం వెనుకున్న కారణాలు ఏంటో పరిశీలించాల్సి ఉందని నాయకులకు తెలిపారు.

హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం పట్టణం శివారు ప్రాంతం వరకు నీళ్లు తీసుకువచ్చామని, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చంద్రబాబు నేతలతో అన్నారు. ఈ నెలాఖరులో కుప్పం వస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓటమిని అంతటితో వదిలేయాలని, భవిష్యత్తుపై దృష్టిపెట్టాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పార్టీ పరంగా, నేతల పరంగా ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకుని, ఆశావహదృక్పథంతో ముందడుగు వెయ్యాలని అన్నారు. టీడీపీ ఇకపై నిరంతరం పోరాడాలని, వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News