Andhra Pradesh: జగన్ అధికారంలోకి వస్తాడని ముందే చెప్పా.. ఏపీకి కేంద్రం సహకారం ఉంటుంది!: కన్నా లక్ష్మీనారాయణ

నరేంద్ర మోదీ చరిష్మాతోనే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో పెద్దపెద్ద వ్యాపారస్తుల నుంచి రోడ్డుపై చిరు వ్యాపారుల వరకూ అందరకూ మోదీ ఐదేళ్ల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. మోదీ ఉంటేనే భారత్ ఇండియాలా ఉంటుందనీ, లేదంటే పాకిస్థాన్ అయిపోతుందని హెచ్చరించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నా లక్ష్మీనారాయణ పలు అంశాలపై ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తాడని తాను ముందే చెప్పానని తెలిపారు. ఏపీలో 130కి పైగా సీట్లు జగన్ కు ఈసారి రావచ్చు అని చెప్పినట్లు గుర్తుచేశారు. టీడీపీ అరాచకాలను మౌనంగా భరించిన ప్రజలు గుట్టుచప్పుడు కాకుండా సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అన్నిరకాలుగా సహకారం ఉంటుందని చెప్పారు.

ఏపీకి వచ్చిన సొమ్మంతా గత ప్రభుత్వం దాచేయడం వల్లే పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నగదుకు కరవు ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా నగదు కొరత రాలేదన్నారు. చంద్రబాబుకు తాను 100 ప్రశ్నలు సంధిస్తే, ఒక్కదానికి జవాబు ఇవ్వలేదనీ, గాలిగాళ్లతో గాలిమాటలు మాట్లాడించారని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు డబ్బు, మద్యంను విచ్చలవిడిగా పంచాయని ఆరోపించారు.
Andhra Pradesh
YSRCP
Jagan
BJP
Narendra Modi
kanna

More Telugu News