Smruti Irani: అమేథిలో స్మృతి ఇరానీ ప్రధాన అనుచరుడి దారుణ హత్య!

  • స్మృతి ఇరానీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న సురేంద్ర సింగ్
  • సొంత ఇంటిలోనే తుపాకితో కాల్పులు
  • కేసును విచారిస్తున్న పోలీసులు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఇరానీ ప్రధాన అనుచరుడు అమేథిలో దారుణంగా హత్యకు గురి కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్, బీజేపీ స్థానిక నేతగా ఉంటూ, స్మృతి ఇరానీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనవంతు కృషి చేశాడు. బరోలియాలోని తన ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపారు.

ఈ సమయంలో ఇంట్లో కుటుంబీకులు ఎవరూ లేరు. ఇది రాజకీయ హత్యేనని భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటన తరువాత బరోలియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
Smruti Irani
Surendra Singh
Murder
Amethi

More Telugu News