Andhra Pradesh: టీడీపీ నేతలతో చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న కుమ్మక్కు అయ్యాడు.. ఎన్నికల అధికారిని బెదిరించాడు!: విజయసాయిరెడ్డి

  • దీంతో ఎన్నికల అధికారి రిగ్గింగ్ జరగలేదని రాశాడు
  • కలెక్టర్ దళితులను ఓటేయకుండా చేశారు
  • బూత్ దగ్గరకు వచ్చినవారిని సిరా వేసి పంపించివేశారు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈరోజు వైసీపీ ప్రతినిధుల బృందం కలుసుకుంది. ఈనెల 23న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఏపీ పోలీసులకు అదనంగా కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. టీడీపీ నేతలు పోలింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు జిల్లా కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైన చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకొచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘తన పేషీలో ఆఫీసర్ గా పనిచేసిన అధికారిని చిత్తూరు కలెక్టర్ గా నియమించి చంద్రబాబు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. గత నెల 11న పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎన్నికలు జరిగిన తీరుపై వైసీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఏడు చోట్ల టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో కుమ్మక్కు అయి దళితులను ఓటేయడానికి రాకుండా చేశారు. ఒకవేళ పోలింగ్ కేంద్రం వరకూ వచ్చినా చేతి వేలికి సిరా వేసి పంపించివేశారు.  

ఈ విషయంలో మేం చేసిన ఫిర్యాదు ఈసీ పరిశీలించింది. కలెక్టర్ ప్రద్యుమ్న పోలింగ్ అధికారిని బెదిరించాడు. దీంతో అతను ప్రాణభయంతో రిగ్గింగ్ జరగలేదని డైరీలో రాశాడు.  ఈ ఏడు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగింది. కావాలంటే సీసీటీవీలను పరిశీలించండన్న మా వినతిని కలెక్టర్ ప్రద్యుమ్న తిరస్కరించారు. ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని కలెక్టర్ ఈసీకి నివేదిక ఇచ్చారు’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

More Telugu News