Andhra Pradesh: మంగళగిరిలో గెలుపు కోసం లోకేశ్ రూ.150-200 కోట్లు పంచారు!: ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణ

  • ఐఫోన్లు, టూవీలర్లు, ఏసీలు ఇష్టానుసారం పంచారు
  • మంగళగిరి ఫలితాలపై ఎన్నారైలు వాకబు చేస్తున్నారు
  • ఓ వీడియోను విడుదల చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపుకోసం లోకేశ్ ఏకంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదనీ, ప్రజలే చెప్పుకుంటున్నారని స్పష్టం చేశారు. మంగళగిరిలో ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టూవీలర్లు, టీవీలు, ఐఫోన్లు, ఇష్టంవచ్చినట్లు పంచారని విమర్శించారు.

టీడీపీ ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్న నిరుపేదలు, యువత, సామాన్యుల ఆకాంక్షల ముందు నిలబడవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. ఓ నిరుపేద పెద్దావిడ వచ్చి తనకు రూ.వెయ్యి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, ఇతర కారణాలతోనే ఈ విషయాన్ని ముందుకు తీసుకురాలేకపోయానని చెప్పారు.

ఇందుకు క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. మంగళగిరి ఫలితాలపై పలువురు ఎన్నారైలు కూడా తనను వాకబు చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి అసెంబ్లీ స్థానంతో పాటు గుంటూరు లోక్ సభ సీటు నుంచి కూడా వైసీపీ జెండానే ఎగురుతుందని జోస్యం చెప్పారు.

More Telugu News