Uttar Pradesh: ప్రాణాలైనా విడుస్తా కానీ.. బీజేపీకి మాత్రం లాభం కలిగేలా పనిచేయను!: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ

  • బీజేపీ ఓటు బ్యాంకునే చీలుస్తున్నా
  • వాళ్ల భావజాలం వినాశకరమైనది
  • యూపీలో మీడియాతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
బీజేపీ లాంటి వినాశకరమైన శక్తికి తాను ఎన్నడూ లబ్ధి చేకూర్చనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్ చార్జి ప్రియాంకా గాంధీ తెలిపారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బీజేపీకి లబ్ధి చేకూర్చే బదులుగా ప్రాణాలు విడుస్తానని వ్యాఖ్యానించారు. యూపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాయ్ బరేలీ నియోజకవర్గంలో ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ మేరకు స్పందించారు.

తన ప్రచారం ద్వారా బీజేపీ ఓట్లు చీలుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ భావజాలం వినాశకరమైనదని అభిప్రాయపడ్డారు. విపక్షాల ఓట్లను తాను చీలుస్తున్నానంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

తాను కేవలం బీజేపీ ఓటు బ్యాంకుపైనే దృష్టి సారించానన్నారు. ప్రజాస్వామ్యంతో పాటు రాజ్యాంగ బద్ధమైన సంస్థలను కాపాడుకునేందుకు జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ప్రియాంక వ్యాఖ్యానించారు. ప్రజలందరూ ప్రేమిస్తున్న భారత్ కోసం తాము పోరాడుతున్నామనీ, అధికారం కోసం కాదని ప్రియాంక స్పష్టం చేశారు.


Uttar Pradesh
Congress
BJP
priyanka gandhi

More Telugu News