పబ్ జీ ఆడొద్దని చెప్పిన భర్త.. విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లిన భార్య!
- యూఏఈలో విచిత్రమైన ఘటన
- తన హక్కులను కాలరాస్తున్నాడని భర్తపై ఆగ్రహం
- భార్య ఫిర్యాదుపై లబోదిబోమన్న భర్త
యూఏఈలోని ఓ యువతి(20)కి ఇటీవల వివాహమయింది. అయితే పెళ్లయిన దగ్గరి నుంచి ఆమె ఫోన్ లో పబ్ జీని విపరీతంగా ఆడటాన్ని గమనించిన భర్త.. దాన్ని మానుకోవాలని సూచించాడు. దీంతో ఒక్కసారిగా సదరు యువతి అగ్గిమీద గుగ్గిలమయింది. ‘నాకు విడాకులు కావాల్సిందే’ అని కోపంతో బుసలుకొట్టింది. ఈ విషయమై పోలీసులు ఏమయిందని ప్రశ్నించగా, తనకు కావాల్సిన వినోదాన్ని ఎంచుకునే హక్కును తన భర్త కాలరాస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
పబ్ జీ గేమ్ ను తాను కేవలం స్నేహితులు, బంధువులతోనే ఆడతానని స్పష్టం చేసింది. అయితే ఆమెను బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదనీ, కేవలం పబ్ జీకి బానిస కాకూడదన్న ఉద్దేశంతోనే దూరంగా ఉండాలని కోరానని భర్త వాపోయాడు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు త్వరలోనే విచారణ జరిపి తీర్పును వెలువరించనుంది.