60 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్థాన్
- విడుదలైన వారిలో 55 మంది మత్స్యకారులు
- మిగిలిన వారు సరైన వీసా, డాక్యుమెంటేషన్ లేనివారు
- ఈ నెలలో 360 మందిని విడుదల చేసిన పాక్
ఈరోజు విడుదలైనవారంతా తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నవారే. వీరిలో కొందరు శిక్షాకాలం కంటే ఎక్కువగానే జైలు జీవితాన్ని గడిపారు. ఈ సందర్భంగా షోయబ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, డబ్బ సంపాదన కోసం తాను పాకిస్థాన్ వెళ్లానని, అయితే ఒక చెడు సంస్థ చేతిలో పడ్డానని వాపోయాడు. తనకు 3 నెలల జైలు శిక్ష పడిందని... కానీ, 18 నెలలు జైలు జీవితాన్ని గడిపానని చెప్పారు.
వాహిద్ ఖాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, పాకిస్థాన్ లో తన వీసా పోగొట్టుకున్నానని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, 20 నెలలు జైల్లో ఉంచారని తెలిపాడు. స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.
జైలు శిక్షను పూర్తి చేసుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి పంపాలంటూ ఏప్రిల్ 9న పాకిస్థాన్ ను భారత్ కోరింది. వెంటనే స్పందించిన పాకిస్థాన్ ఏప్రిల్ 14 వరకు 300 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. ఈరోజు మరో 60 మందికి స్వేచ్ఛను ప్రసాదించింది.