ఆర్సీబీయా? కేకేఆరా? నేటితో తేలిపోతుంది!
- నేటి రాత్రి 8 గంటలకు మ్యాచ్
- రెండు జట్లకూ 8 పాయింట్లు
- గెలిస్తేనే ప్లే ఆఫ్ చాన్స్
ఇక ప్రతి జట్టూ 14 మ్యాచ్ లను ఆడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో ఆర్సీబీ, కేకేఆర్ లకు 12 మ్యాచ్ లు ముగుస్తాయి. ఓడిన జట్టు ఆపై ఆడే మిగతా రెండు మ్యాచ్ లను గెలిచినా 12 పాయింట్లకు మాత్రమే చేరుతుంది. 12 పాయింట్లు సాధించే జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఉండవు. కనీసం 14 పాయింట్లు సాధిస్తే, మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడి, జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ చరిత్రలో 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఓ జట్టు వెళ్లిన సందర్భాలు మూడు మాత్రమే.
ఇప్పటివరకూ చెన్నై మాత్రమే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ ను ఖరారు చేసుకోగా, మిగతా మూడు స్థానాల కోసం ముంబై, ఢిల్లీలు 14 పాయింట్లతో, హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ లు 10 పాయింట్లతో పోటీలో ఉన్నాయి. ఈ ఐదు జట్లకూ ప్లే ఆఫ్ అవకాశాలు ఉండగా, వీటి ఆటతీరు, గెలుపోటములపై నేడు ఆర్సీబీ, కేకేఆర్ ల మధ్య గెలిచే జట్టుకు చాన్స్ ఉంటుంది. దీంతో ఈ పోరును రెండు జట్లూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయనడంలో సందేహం లేదు.