BJP: ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెల్లించాలి... ఇంటర్ మార్కుల్లో అవకతవకలపై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ డిమాండ్
- ప్రభుత్వం వెంటనే స్పందించాలి
- న్యాయవిచారణ జరిపించాలి
- ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు చేపడతాం
తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం తీవ్ర రూపు దాల్చుతోంది. చాలా మంది విద్యార్థులు అనూహ్యరీతిలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫస్టియర్ లో డిస్టింక్షన్ వచ్చినవాళ్లు కూడా కొందరు సెకండియర్ లో ఫెయిల్ మెమోలు అందుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు.
విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు, ఫలితాల్లో వచ్చిన మార్కులకు పొంతనే లేదని మండిపడ్డారు. ఈ విషయంపై రేపటిలోగా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మార్కుల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని లక్ష్మణ్ కోరారు. అసలు ఈ వ్యవహారం మొత్తంపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.