mukhesh ambani: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముఖేశ్ అంబానీ మద్దతు!

  • దక్షిణ ముంబై కాంగ్రస్ అభ్యర్థిగా మిలింద్ దియోరా
  • ఈ నియోజక వర్గం పరిస్థితులపై దియోరాకి అవగాహన వుంది
  • దియోరా పాలన అనుభవంతో ముంబైకి పూర్వ వైభవం
ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ తో కాంగ్రెస్ అభ్యర్థిగా మిలింద్ దియోరా తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దియోరాకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన మద్దతును తెలపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'దక్షిణ ముంబైను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన నాయకుడు దియోరా' అంటూ ఆయన ఒక వీడియోలో చెప్పుకొచ్చారు.

దక్షిణ ముంబై నుంచి పది సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించిన అనుభవం మిలింద్ దియోరాకు ఉందనీ, అక్కడి నియోజక వర్గంలోని సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక సమస్యలపై ఆయనకి మంచి అవగాహన ఉందనే అభిప్రాయాన్ని ముఖేష్ అంబానీ వ్యక్తం చేశారు.

ఇక ఇదే వీడియోలో కొటాక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటాక్ కూడా కనిపించారు. ఆయన కూడా మిలింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ముంబైలో వ్యాపార వ్యవహారాలు పూర్వ స్థితికి చేరుకోవాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా దియోరా వంటి సమర్ధుడైన నాయకుడు అవసరమంటూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ మాట్లాడారు.

కాగా, సాధారణంగా ఏ ఎన్నికల్లోనూఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా వ్యవహరించే ముఖేష్ అంబానీ ఇలా ఒక అభ్యర్థికి మద్దతు తెలపడం ఒక విశేషం అయితే.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో తన  సోదరుడు అనిల్ అంబానీపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి ఆయన మద్దతు ఇవ్వడం సంచలనం అయింది.  
mukhesh ambani

More Telugu News