Andhra Pradesh: ఈ ఎన్నికల్లో టీడీపీ ‘స్వీప్ సునామీ’ సృష్టించబోతోంది: కోడెల శివప్రసాద్

  • ఓ పథకం ప్రకారమే నాపై మొన్న దాడి జరిగింది
  • కావాలనే మేము వెనక్కి తగ్గాం
  • ప్రజలు వాళ్లకు సమాధానం చెప్పనున్నారన్న కోడెల
ఈ ఎన్నికల్లో టీడీపీ ‘స్వీప్ సునామీ’ సృష్టించబోతోందని కోడెల శివప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి ఈరోజు సాయంత్రం ఆయన వెళ్లారు. ఐదేళ్ల తర్వాత టీడీపీ కార్యాలయానికి ఆయన వెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇనిమెట్లలో తనపై జరిగిన దాడి విషయాన్ని ప్రస్తావించారు.

నరసరావుపేటలో ఐదేళ్లుగా శాంతిభద్రతలను కాపాడానని అన్నారు. ఓ పథకం ప్రకారమే తనపై మొన్న దాడి జరిగిందని, కావాలనే తాము వెనక్కి తగ్గామని, ఘర్షణ పడవద్దని తమ కార్యకర్తలకు చెప్పానని, వైసీపీ నేతలు ఎలాంటి వారో ప్రజలందరికీ తెలియాలని అన్నారు. పశ్చాత్తాప పడాల్సిన వాళ్లు తమపైనే ఫిర్యాదు చేశారని విమర్శించారు. దాడి జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నారు? వాళ్లకు సమాధానం చెప్పొచ్చుగా? అని చాలా మంది తనతో అన్న విషయాన్ని ప్రస్తావించారు.

‘ఓటు’ ద్వారా ప్రజలు వాళ్లకు సమాధానం చెప్పనున్నారని అన్నారు. వైఎస్ జగన్ కు, ఆ పార్టీకి ఓటు వెయ్యాలని ప్రజలెవ్వరూ కోరుకోరని, మన రాష్ట్రం బాగుపడాలనుకున్న వారెవ్వరూ ఓటెయ్యరని అన్నారు. తనపై భౌతికంగా దాడి చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టిన వైసీపీ, ప్రజలకు సమాధానం చెప్పాలని కోడెల డిమాండ్ చేశారు. 
Andhra Pradesh
Telugudesam
kodela
YSRCP
jagan

More Telugu News