మోదీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడని దాడి...చనిపోయిన వృద్ధుడు
- వాగ్వాదం సందర్భంగా దాడిచేసిన బస్సు డ్రైవర్
- తమిళనాడులోని తంజావూరు సమీపంలో ఘటన
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ప్రధాని మోదీకి వీరాభిమాని అయిన గోవిందరాజు సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో మోదీకి ఓటు వేయాలంటూ ఒరత్తనాడు పరిసరాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. శనివారం రాత్రి మోదీ చిత్రపటాన్ని మెడలో వేసుకుని ఒరత్తనాడు అన్నా విగ్రహం సమీపంలో ఇలాగే ప్రచారం చేస్తుండగా ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రైవేటు బస్సు డ్రైవర్ గోపీనాథ్ (33) అతని వద్దకు వచ్చాడు.
మోదీకి ఎలా ప్రచారం చేస్తావంటూ అతనితో తగాదాకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆగ్రహం ఆపుకోలేని గోపీనాథ్, గోవిందరాజుపై దాడి చేశాడు. స్పృహతప్పి పడిపోయిన గోవిందరాజును స్థానికులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. గోవిందరాజు కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. గోపీనాథ్‌ను డీఎంకే-కాంగ్రెస్ మద్దతుదారునిగా భావిస్తున్నారు.