Andhra Pradesh: పూతలపట్టులో రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది: ద్వివేది

  • ఎన్నికల పరిశీలకుల నివేదిక కీలకం
  • జరిగిన ఘటనలు సీఈసీకి నివేదిస్తాం
  • ఆపై నిర్ణయం తీసుకుంటాం
కేంద్ర ఎన్నికల పరిశీలకుల నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల రీపోలింగ్ పై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ పరిస్థితులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని చెప్పారు. రాయలసీమలో ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్న ఆయన, తాడిపత్రి హత్యల కారణంగా అక్కడ ఓటింగ్ కాస్త ఆలస్యం అయిందని వివరణ ఇచ్చారు. మరికొన్ని సంఘటనలను కూడా ఎన్నికల సంఘానికి రిపోర్టు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని ద్వివేది వెల్లడించారు. ఈ క్రమంలో తుది నిర్ణయం తీసుకునేటప్పుడు స్థానిక ఆర్వో పరిశీలించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇక, పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఆయా పార్టీల నుంచి డిమాండ్లు వచ్చాయని, జరిగిన విషయాలపై ఫిర్యాదులు అందాయని ద్వివేది వెల్లడించారు. అయితే, చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన సంఘటనలు చూస్తే అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాగా, రాష్ట్రంలో 70.67 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల అధికారి ఉమేశ్ సిన్హా తెలిపారు.
Andhra Pradesh

More Telugu News