Andhra Pradesh: వైసీపీ నేతలు గెలిస్తే గూండాయిజం, కబ్జాలే.. టీడీపీ నేతలు ఇప్పటికే కబ్జాలను చేసి చూపించారు!: పవన్ కల్యాణ్

  • టీడీపీ, వైసీపీ నేతలు పాపాలు చేసి సంపాదించిన సొమ్మును ఇస్తున్నారు
  • ఈ డబ్బులను ప్రజలకు పంచడం ద్వారా తమ పాపాలను కడుక్కుంటున్నారు
  • విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో పవన్ బహిరంగ సభ
ఈ ఎన్నికల్లో జనసేన లోక్ సభ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ, విశాఖ ఉత్తరం అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ నేతలు మతగ్రంథాలపై, భగవంతుడి ఆలయాలపై ఒట్లు వేయించుకుని డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. అక్రమ పద్ధతుల్లోనే ఈ డబ్బును సంపాదించారని అన్నారు. ఈ డబ్బులు పంచడం ద్వారా వైసీపీ, టీడీపీ నేతలు పాపాలను కడుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.

పవన్ కల్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదనీ, ఓ వ్యవస్థ అని ఆయన తెలిపారు. విశాఖ ఉత్తరం ప్రాంతంలో తీవ్రమైన కాలుష్యం ఉందనీ, కానీ దీని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పం  జనసేన పార్టీకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాగూ గెలవదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హరిబాబు, విష్ణుకుమార్ రాజులు కనిపిస్తే తన తరఫున నమస్కారం చెప్పాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకు ఇంకో పదేళ్లయినా ప్రజలు క్షమించరన్నారు. భూములు కబ్జాలు చేసే వ్యక్తులను జైల్లో పెట్టిస్తామని పవన్ హెచ్చరించారు.  వైసీపీ నేతలు విశాఖలో గెలిస్తే గూండాయిజం, రౌడీయిజం చేస్తారనీ, భూకబ్జాలకు పాల్పడుతారని పవన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతలను గెలిపిస్తే వాళ్లు ఇప్పటికే ఈ కబ్జాలను చేతల్లో చేసి చూపారని దుయ్యబట్టారు. గంటా శ్రీనివాసరావు వంటి వ్యక్తులు భూములను కబ్జా చేసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
Jana Sena
Pawan Kalyan

More Telugu News