Andhra Pradesh: జాతీయ నేతలతోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు: బొత్స సత్యనారాయణ

  • ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయాలంటే భయమెందుకు
  • టీడీపీ కార్యకర్తలా ఆయన వ్యవహరిస్తున్నారు  
  • ఏపీలోనూ టీడీపీ కనుమరుగైపోవడం ఖాయం
తమ అధినేత జగన్ పై చంద్రబాబు అబద్ధాలు చెబుతుండటమే కాకుండా, జాతీయ నేతలతోనూ చెప్పిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. కడపలో నిన్న టీడీపీ ఎన్నికల ప్రచారంలో జగన్ పై నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బొత్స స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలంటే బాబుకు ఎందుకు భయం? అని ప్రశ్నించారు.

ఏబీ వెంకటేశ్వరరావు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా, టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని, పోలీసు వాహనాల్లో టీడీపీ నాయకులు దర్జాగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈసీకి ఇచ్చామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పైనా ఆయన ఆరోపణలు చేశారు. బాధ్యత గల ఉద్యోగిలా కాకుండా టీడీపీ కార్యకర్తలా ఠాకుర్ పనిచేస్తున్నారని, ఆయన్ని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ కనుమరుగైపోవడం ఖాయమని బొత్స జోస్యం చెప్పారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Botsa Satyanarayana

More Telugu News