BJP: గతంలో జనతాదళ్ ను బొందపెట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ ను బొందపెడుతున్నారు: జైపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగిన డీకే అరుణ

  • కాంగ్రెస్ పతనానికి ఉత్తమ్, జైపాల్ కారణం
  • నేతలు పార్టీని వీడడానికి ఈ ఇద్దరే బాధ్యులు
  • తీవ్ర విమర్శలు చేసిన సీనియర్ మహిళా నేత

ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ మహిళా నేత డీకే అరుణ హస్తం నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డే కారణమని అన్నారు. వీళ్లిద్దరూ సొంత పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ అస్థిరతను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత జిల్లాలోనే తనకు వ్యతిరేకంగా గ్రూప్ ను తయారుచేశారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైనే విమర్శలు చేసే విధంగా ఆ గ్రూప్ ను ఉత్తమ్ ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇక, జైపాల్ రెడ్డి విషయానికొస్తూ, ఆయన గతంలో జనతాదళ్ పార్టీని బొందపెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బొందపెడుతున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా పాతాళానికి దిగజారడానికి జైపాల్ రెడ్డి కూడా ఓ కారణమని అన్నారు. జైపాల్ రెడ్డి ఓ మేధావి అని, ఆయన సలహాలు, సూచనలతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తారని డీకే అరుణ వ్యంగ్యం ప్రదర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని చెప్పినా జైపాల్ రెడ్డి, ఉత్తమ్ తన మాట పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పొత్తు ఫలితంగా పార్టీ తీవ్ర సంక్షోభంలో పడిందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ తనకు ఆహ్వానం వచ్చినా, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, అందుకే ఆ పార్టీలో చేరానని వివరించారు.

More Telugu News